ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆలయ అధికారులు ఆహ్వానించారు.

విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్ సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి, స్వామివార్ల చిత్రపటం మరియు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. సుమారు 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవం కోసం ఇంద్రకీలాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కంచి పీఠాధిపతి పర్యవేక్షణలో ఈ క్రతువు జరగనుంది.రాష్ట్ర క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ కుంభాభిషేకానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులను ఇప్పటికే కమిటీ ఆహ్వానించింది.
