ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇకపై మీరు ఎక్కే ఆటో లేదా క్యాబ్ డ్రైవర్ కేవలం మిమ్మల్ని గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా, ఆ ప్రాంత చరిత్రను వివరించే ‘టూరిస్ట్ గైడ్’గానూ వ్యవహరిస్తారు. ఇందుకోసం ఏపీ పర్యాటక శాఖ, ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ‘రాపిడో’తో కలిసి చేపట్టిన ‘గైడ్-కమ్-డ్రైవర్’ శిక్షణ కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా సాగుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడలో 280 మంది డ్రైవర్లకు (248 ఆటో, 32 క్యాబ్) రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో విదేశీ పర్యాటకులతో మాట్లాడటానికి ‘భాషిణి’ యాప్ వాడకం, చారిత్రక కట్టడాల గురించి వివరించే ‘స్టోరీ టెల్లింగ్’ వంటి అంశాలపై నైపుణ్యం కల్పించారు. రాపిడో యాప్‌లో ఇప్పుడు “టూరిస్ట్ గైడ్” అనే ప్రత్యేక ఐకాన్‌ను చేర్చారు. దీని ద్వారా పర్యాటకులు సర్టిఫైడ్ గైడ్-డ్రైవర్లను సులభంగా ఎంచుకోవచ్చు.ఈ శిక్షణలో మహిళా ఆటో డ్రైవర్లు కూడా పాల్గొనడం విశేషం. ఇది పర్యాటక రంగంలో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. మార్చి 6తో విజయవాడ పైలట్ ప్రాజెక్ట్ ముగియనుంది. ఇక్కడ లభించిన స్పందనతో త్వరలోనే తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ శిక్షణను విస్తరించనున్నారు.
“అతిథి దేవో భవ” అనే సంప్రదాయానికి సాంకేతికతను జోడించి, డ్రైవర్లను రాష్ట్ర పర్యాటక రాయబారులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
