భర్త మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్న గిరిజన మహిళకు చెందిన సాగు భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఆంజనేయపురంలో చోటుచేసుకుంది.

బాధితురాలి వివరాల ప్రకారం, సర్వే నెంబర్ 1142/5Aలో సుమారు 3 ఎకరాల భూమిని ఆమె భర్త తాల్ల వెంకటేశ్వర్లు పేరిట ప్రభుత్వం నుంచి డి-ఫారం పట్టా ద్వారా పొందారు. గత 30 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె తెలిపారు.అయితే ఇటీవల రాపూరుకు చెందిన కొందరు వ్యక్తులు తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి “ఇది మాది” అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. భర్త ఉన్నంత కాలం ఎలాంటి సమస్యలు లేవని, ఇప్పుడు తాను ఒంటరిగా ఉన్నందున తన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు బాధితురాలు రాపూరు తహసీల్దార్ లక్ష్మినరసింహంకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
