ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి థీమ్ పార్కులు, వినోద ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కర్నూతల గ్రామంలో డిస్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టు ప్రతిపాదనపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.

ఇలాంటి భారీ ప్రాజెక్టులకు రూ.35,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు అందిస్తుందని పేర్కొన్నారు.పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడిపై 5–10 శాతం సబ్సిడీతో పాటు రూ.40 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిపారు. అలాగే స్టాంపు డ్యూటీ రీయింబర్స్‌మెంట్, భూ వినియోగ మార్పిడి రుసుము మినహాయింపు, విద్యుత్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్, SGST రీయింబర్స్‌మెంట్ వంటి పలు రాయితీలు అందిస్తామని చెప్పారు.తిరుపతి, విశాఖలో థీమ్ పార్కుల ఏర్పాటుపై కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ రూ.18,448 కోట్ల విలువైన 102 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు.
