ఆంధ్రప్రదేశ్‌ను ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై జరిగిన సమీక్షలో ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ (AP-TSMM) ఏర్పాటు అంశంపై చర్చించారు.
ఈ మిషన్ ద్వారా వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, సుమారు 40,000 ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర తీరప్రాంతంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో టైటానియం పార్క్, అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, మచిలీపట్నంలో సమగ్ర టైటానియం–రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తాయని సీఎం పేర్కొన్నారు.
