కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని గణేష్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు కుళ్లిన కోడిగుడ్లు అందించిన ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం నమోదు చేసుకున్న ఓ గర్భిణికి అందించిన కోడిగుడ్లలో ఒకదాన్ని ఉడకబెట్టగా, లోపలి భాగం పూర్తిగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లింది. మిగతా గుడ్లను పరిశీలించగా అవి కూడా పాడై ఉన్నట్లు గుర్తించారు.ఈ విషయాన్ని గర్భిణి కుటుంబ సభ్యులు వెల్లడిస్తూ, ఇలాంటి ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇక అంగన్‌వాడీ సిబ్బంది, సరఫరా కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కు జరిగి పాత స్టాక్‌ను గర్భిణులకు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ రికార్డులు, లబ్ధిదారుల జాబితాలు, కేంద్రాల పనితీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
