జిల్లాలో భారీ రాళ్ల వర్షం, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పెద్ద సైజులో రాళ్లు పడటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
భిక్కనూర్ మండలం మెటాట్‌పల్లి గ్రామంలో పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. భారీ శబ్దంతో పిడుగు పడటంతో గ్రామస్తులు భయపడిపోయారు.మరోవైపు అకాల వర్షాల వల్ల గాంధారి, జుక్కల్ మండలాల్లో కోత దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి నేలరాలగా, కూరగాయల పంటలకు కూడా నష్టం వాటిల్లింది.ఇంకా నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
