అకాల వర్షాలు, మంచు తెగుళ్లతో పంట నష్టపోయిన జీడీ రైతులు ఉరి తాళ్లతో ఆందోళన చేపట్టారు. ఎకరానికి రూ.30 వేల పరిహారం డిమాండ్.
అకాల వర్షాలు, మంచు తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన జీడీ రైతులు ఉరి తాళ్లతో నిరసన చేపట్టారు. వాలాబు పంచాయతీలో గిరిజన రైతులు అర్ధనగ్నంగా మెడకు ఉరి తాళ్లు వేసుకుని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు మాట్లాడుతూ, ఈ ఏడాది జీడీ పంట పూర్తిగా దెబ్బతిన్నదని, సంవత్సరాంతం ఈ పంటపైనే ఆధారపడే గిరిజన కుటుంబాలు అప్పుల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, జీడీ పంటకు కనీస మద్దతు ధర కేజీకి రూ.200 ప్రకటించి, ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. పంట బీమా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, ప్రభుత్వ భాగస్వామ్యం లేకపోవడంతో రైతులకు నష్టమే మిగులుతోందని విమర్శించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నక్కపల్లి పర్యటన సందర్భంగా జీడీ రైతుల సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
