నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే అరికట్టాలని ఏపీ ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించిన ఆయన, మండలంలోని 21 పంచాయతీల పరిధిలో ఉన్న 42 గ్రామాల్లో ప్రతి గ్రామంలో 4-5 బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపించారు.
లైసెన్స్ ఉన్న మద్యం దుకాణ యజమానులు సిండికేట్‌గా మారి గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. తెల్లవారుజామున నుంచే మద్యం విక్రయాలు జరగడంతో పేద ప్రజలు వ్యసనాలకు బానిసలవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వచ్చే నెలలో జరిగే పెంచలకొన బ్రహ్మోత్సవాల లోపు అన్ని బెల్ట్ షాపులను మూసివేయాలని, లేనిపక్షంలో మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
