ఈ నెల 11న జరిగే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశం
గుంటూరు: గుంటూరు జిల్లాను సర్వతోముఖాభివృద్ధి పథంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ కమిటీ హాల్‌లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన “బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ – 2026-27” నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి: రాష్ట్ర బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రతి జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి వరకు బడ్జెట్ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని మంత్రి దుర్గేష్ తెలిపారు. స్థానిక అవసరాలు, రంగాల వారీ ప్రాధాన్యతలను బట్టి నిధుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
సమీక్షా సమావేశం: ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై జరగనున్న సమీక్షా సమావేశానికి ముందే ప్రజాప్రతినిధులు మరియు అధికారులు తమ పరిధిలోని ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై పూర్తి స్పష్టతతో ఉండాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. తొలుత 7వ తేదీన సమీక్షా సమావేశం అనుకున్నప్పటికీ 11కి వాయిదా పడిందన్నారు.
