Singaporeలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి Gan Siow Huangతో ఏపీ మంత్రులు సమావేశమయ్యారు.

India హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్య కుమార్, అనగాని సత్య ప్రసాద్ పాల్గొన్నారు.ఈ భేటీలో భారత్–సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.అలాగే స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని వినియోగించడం, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన విద్య, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి.సింగపూర్ ప్రభుత్వం ఆధునిక పరిపాలన విధానాలు, నగరాభివృద్ధి నమూనాలు, సుస్థిర అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడానికి సానుకూలంగా స్పందించింది. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరగడంతో, భవిష్యత్తులో భారత్–సింగపూర్ సంబంధాలు మరింత బలపడతాయని ఇరు దేశాల నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

