అమెరికాలో H-1B వీసాలపై 3 సంవత్సరాల విరామం విధించేలా కొత్త బిల్లు ప్రవేశపెట్టడంతో భారీ చర్చ మొదలైంది. Eli Crane ప్రవేశపెట్టిన “End H-1B Visa Abuse Act of 2026” బిల్లు, వీసా వ్యవస్థలో కీలక మార్పులను ప్రతిపాదిస్తోంది.

ఈ బిల్లు ప్రకారం, కొత్త H-1B వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు, ప్రస్తుతం 65,000గా ఉన్న వార్షిక కోటాను 25,000కు తగ్గించే ప్రతిపాదన ఉంది. అలాగే లాటరీ విధానాన్ని రద్దు చేసి, జీతాల ఆధారంగా ఎంపిక చేసే విధానాన్ని తీసుకురావాలని సూచించింది.ఇంకా, కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించడానికి కనీసం $200,000 జీతం ఇవ్వాలని, అమెరికన్ ఉద్యోగులను తొలగించలేదని ధృవీకరించాల్సి ఉంటుంది. OPT వంటి అవకాశాలను కూడా రద్దు చేసే ప్రతిపాదన ఇందులో ఉంది.ఈ బిల్లుకు మద్దతుదారులు అమెరికన్ ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని చెబుతుండగా, నిపుణులు మాత్రం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమేనని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లేకపోవడంతో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ మార్పులు అమలైతే, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటీవల గణాంకాల ప్రకారం, H-1B వీసాలలో పెద్ద భాగం భారతీయులకు వెళ్తున్నాయి.
