పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు దొరక్క ఏడుస్తుంటే.. ఈ ముఠాలు కూడానా!!

May 4, 2026 4:23 PM

పెళ్లిళ్ల పేరుతో అమాయక యువకులను మోసం చేస్తున్న దొంగ పెళ్లికూతురు ముఠాను ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. సిందూరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చియుతహా బజార్ సమీపంలో నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. జితేంద్ర అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ముఠా దగ్గర నుండి పోలీసులు రూ. 39,500 నగదుతో పాటు వెండి పట్టీలు, ఒక మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా చాలా పక్కా ప్లాన్‌తో నకిలీ పెళ్లిళ్లు ఏర్పాటు చేసి, వరుడి నుంచి డబ్బు, నగలు దోచుకునేది. ఎటా ప్రాంతానికి చెందిన రంజీత్ చౌహాన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జితేంద్ర, నలుగురు మహిళలు కలిసి అంజలిక అనే అమ్మాయితో తన వివాహం నిశ్చయించారని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాస్తవానికి ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లై ఒక బిడ్డ కూడా ఉండగా, ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని ముఠా సభ్యులు అబద్ధం చెప్పారు. సిందూరియా ప్రాంతంలోని ఒక స్థానిక గుడిలో పెళ్లి తంతు జరిపిస్తూ, పెళ్లి ఖర్చుల పేరుతో బాధితుడి నుంచి దాదాపు లక్ష రూపాయల నగదు, నగలు లాక్కున్నారు. పెళ్లి సగం జరుగుతుండగానే నిందితులు ఒక్కసారిగా బాధితుడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. పెళ్లికూతురితో పాటు జితేంద్ర పారిపోయాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమిత్ర, లాల్తీ, కాజల్, అంజలిక అనే నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. విచారణలో లాల్తీ ఈ ముఠాకు సూత్రధారి అని తేలింది, ఆమెకు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. పెళ్లికూతురి తల్లిగా నటించిన సుమిత్ర, బాధితుల నమ్మకాన్ని పొందేందుకు తనకు చెవిటి, మూగ ఉన్నట్లు నటించిందని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన నలుగురు మహిళలను జైలుకు తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media