ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న ఫైనల్ జరగనుంది. “వాస్తవానికి ఫైనల్ వేదికగా బెంగళూరును నిర్ణయించాం. అయితే, స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థనలు, నిబంధనలు బీసీసీఐ నిర్దేశించిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌కు అతీతంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేదికను మార్చాల్సి వచ్చింది” అని బీసీసీఐ స్పష్టం చేసింది.
మే 26న ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఇందులో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడతాయి. అనంతరం మే 27న న్యూ చండీగఢ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మూడు, నాలుగు స్థానాల్లోని జట్లు పోటీపడతాయి. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మధ్య జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ కూడా మే 29న న్యూ చండీగఢ్‌లో నిర్వహిస్తారు.
