ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండగా, తాజాగా అతను జట్టుతో కలిసి తదుపరి మ్యాచ్ కోసం ప్రయాణించకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. మే 4న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి (Back spasms) కారణంగా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (RCB) రాయ్‌పూర్‌లో జరగనున్న తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు బుధవారం ముంబై విమానాశ్రయం (టెర్మినల్ 1) నుంచి బయలుదేరింది. అయితే ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, విమానాశ్రయంలో ముంబై జట్టు సభ్యులతో పాటు హార్దిక్ పాండ్యా ఎక్కడా కనిపించలేదు. అతను జట్టుతో తర్వాత కలుస్తాడా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఈ సీజన్‌లో హార్దిక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. బ్యాట్‌తో 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులు మాత్రమే చేయగా, బంతితోనూ దారుణంగా విఫలమయ్యాడు. అధికారికంగా వెన్నునొప్పి అని చెబుతున్నప్పటికీ, గైర్హాజరీ వెనుక కేవలం గాయం మాత్రమే కాకుండా మరేదైనా కారణం ఉందా అనే చర్చ జరుగుతోంది.
