సువేందు అధికారి పీఏ దారుణ హత్య

May 7, 2026 7:26 AM

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. చంద్రనాథ్ రథ్ కారులో ప్రయాణిస్తుండగా ఆయన వాహనాన్ని మరో కారు, ఒక బైక్ వెంబడించాయి. దోహరియా ప్రాంతంలోకి రాగానే కారును ఓవర్‌టేక్ చేసి వేగాన్ని తగ్గించేలా చేశారు. వెంటనే బైక్‌పై వచ్చిన దుండగులు అతి సమీపం నుంచి చంద్రనాథ్ రథ్‌పై కాల్పులు జరిపారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు ఆయన తల, ఛాతీ, పొట్ట భాగాల్లోకి దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దాడిలో కారు డ్రైవర్ బుద్ధదేవ్‌కు కూడా గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, పగిలిపోయిన కారు అద్దాలను, బుల్లెట్ గుర్తులను పరిశీలించారు. బుల్లెట్ షెల్స్‌ను బట్టి ఆస్ట్రియా తయారీ గ్లాక్ పిస్టల్ వంటి చిన్న ఆయుధాన్ని వాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ఈ హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టీఎంసీ ఈ హత్యను తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొంది. గత మూడు రోజులుగా బీజేపీ మద్దతుదారులే పోస్ట్-పోల్ హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media