ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందని, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో కొందరు ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా విధులకు రాకుండా, ప్రైవేటు పనుల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా నియమాలు)-1964 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు, ఏడాదిలోపు గైర్హాజరైన మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేసింది ప్రభుత్వం. వీరిలో 11 మంది ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారని, మిగిలిన వారు నిర్దేశిత గడువులోగా హాజరుకాకపోతే వారిని కూడా తొలగించనున్నారు.
