తెలంగాణను వర్షం పలకరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో మే రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మే 11 లేదా 12 తేదీల్లో అల్పపీడనం బలపడనుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం క్యుములోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
