లక్నోలోని ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతం చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రెండు బంతులకే డకౌట్ చేసిన ప్రిన్స్.. ఆ వికెట్ తీయడానికి సాక్షాత్తూ కోహ్లీ ఇచ్చిన సలహానే ఉపయోగించినట్లు వెల్లడించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మే 7న జరిగిన ఈ మ్యాచ్‌లో 140.4 కి.మీ వేగంతో ప్రిన్స్ యాదవ్ వేసిన బంతి కోహ్లీ బ్యాట్, ప్యాడ్ల మధ్యలో నుంచి వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో కోహ్లీ నివ్వెరపోతూ పెవిలియన్ చేరాడు. మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ మాట్లాడుతూ.. “గత మ్యాచ్ తర్వాత నేను విరాట్ భయ్యాతో మాట్లాడాను. అప్పుడు ఆయన నాకు ఒక సలహా ఇచ్చారు. ‘బంతికి లెంత్ వద్ద స్వింగ్ లేదా సీమ్ లభిస్తున్నంత కాలం అదే లెంత్‌కు కట్టుబడి ఉండు’ అని చెప్పారు. అదే సలహాను నేను ఈ మ్యాచ్‌లో ఉపయోగించాను” అని తెలిపాడు.
విరాట్ కోహ్లీ ఒక రన్ ఛేజింగ్ లో డకౌట్ కావడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 2017లో ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తూ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు (కోహ్లీ, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ) పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్ 16 వికెట్లతో లక్నో తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆరు మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించి, ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయినప్పటికీ, ఆ జట్టు ఇంకా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే కొనసాగుతోంది.
