ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ విజయం

May 9, 2026 8:43 AM

వరుసగా నాలుగు విజయాలు సాధించి ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో, ఓపెనర్ ఫిన్ అలెన్ (100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించడంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 14.2 ఓవర్లలోనే విజయ తీరాలకు చేరుకుంది. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అలెన్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు బాదాడు. అతనికి కామెరాన్ గ్రీన్ (33 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు.

టాస్ ఓడిన ఢిల్లీ బ్యాటింగ్ కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సులు) అర్ధశతకంతో రాణించగా, చివర్లో అశుతోష్ శర్మ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సులు) పర్వాలేదనిపించాడు.

ఓపెనర్లు కేఎల్ రాహుల్ (23), నిస్సంక తొలి వికెట్‌కు 4.6 ఓవర్లలో 49 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే, రాహుల్ ఔటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడింది. నితీశ్ రాణా (8), సమీర్ రిజ్వీ (3), ట్రిస్టన్ స్టబ్స్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిస్సంక దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో అశుతోష్ శర్మ ఒంటరి పోరాటం చేయడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

ఛేజింగ్ లో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే, అంగ్‌క్రిష్ రఘువంశీ వికెట్లను త్వరగానే కోల్పోయింది. అయితే, క్రీజులోకి వచ్చిన గ్రీన్‌తో కలిసి అలెన్ జట్టుకు విజయాన్ని అందించాడు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media