హత్యకు పాల్పడినా, సహకరించినా.. ఆస్తిని పొందే హక్కును కోల్పోతారు

May 11, 2026 11:03 AM

హత్య కేసు నిందితుడికి ఆస్తి దక్కదని సుప్రీం కోర్టు తేల్చేసింది. ఒక వ్యక్తి హత్యకు పాల్పడినా లేదా దానికి సహకరించినా, ఆ మృతుడి ఆస్తిని పొందే హక్కును కోల్పోతారని స్పష్టం చేసింది. మృతుడు రాసిన వీలునామాలో నిందితుడి పేరు ఉన్నప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం, 1956లోని సెక్షన్ 25 ఆధారంగా ఈ తీర్పును వెలువరించింది.

జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక వ్యక్తి హత్యకు పాల్పడినా లేదా దానికి సహకరించినా, ఆ మృతుడి ఆస్తిని పొందే హక్కును కోల్పోతారని సెక్షన్ 25 చెబుతోందని, ఈ నిబంధన వర్తించడానికి, హత్య కేసులో నేరం రుజువై శిక్ష పడాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. తప్పు చేసి దాని నుంచి ప్రయోజనం పొందడానికి ఎవరినీ అనుమతించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే తీర్పు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కే రఘునాథ్ అనే వ్యక్తి హత్య కేసులో ఒకరు నిందితుడిగా ఉన్నారు. రఘునాథ్ తన ఆస్తిని ఆ నిందితుడికే చెందేలా వీలునామా రాశారని అతడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తాను నిందితుడినన్న విషయాన్ని అతడు కోర్టుకు తెలపలేదు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టడం కూడా తీవ్రమైన తప్పిదమని కోర్టు అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించగా, హైకోర్టు అనుమతించింది. తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును పక్కనపెట్టి ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నిబంధన సహజ వారసత్వానికి, వీలునామా ద్వారా సంక్రమించే వారసత్వానికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాబట్టి కుటుంబ సభ్యులను చంపేసి ఆస్తిని అనుభవించాలనుకుంటే అది వీలుపడదని ఈ తీర్పు చెబుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media