విజయ్ వెనుక ఎర్రదొడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి

May 11, 2026 11:22 AM

తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, విజయ్‌తో పదవీ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

విజయ్ విజయానికి కారణమైన వ్యక్తుల్లో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా, కీలక వ్యూహకర్తగా ఉన్నారు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి. ఇటీవల ప్రభుత్వ ఏర్పాటు విషయమై విజయ్ గవర్నర్‌ను కలిసినప్పుడు విజయ్ పక్కనే ఉన్నారు విష్ణురెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయానా బావమరిది. ఆయన స్వస్థలం అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. గత పదిహేనేళ్లుగా చెన్నైలో నివాసం ఉంటూ గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి గతంలో కలికిరి మండలంలో సర్పంచ్‌గా, వైస్ ఎంపీపీగా ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. విష్ణురెడ్డి తల్లి, కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డికి సోదరి. ఈ బంధుత్వం రీత్యా ఆయన కిరణ్ కుమార్‌రెడ్డి, కిశోర్ కుమార్‌రెడ్డి కుటుంబానికి అత్యంత సమీప బంధువు అవుతారు. టీవీకే పార్టీలో కీలక వ్యూహకర్తగా, ఆర్థిక వ్యవహారాల్లో సహాయకుడిగా వ్యవహరిస్తున్నారని తమిళ మీడియా చెబుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media