ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రికార్డు స్థాయి లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ గెలుపుతో ఢిల్లీ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
211 పరుగుల ఛేదనలో ఢిల్లీకి కేవలం 14 పరుగులకే ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు చేరారు. దీంతో ఢిల్లీ 14/2తో కష్టాల్లో పడింది. సాహిల్ పరాఖ్ కూడా అవుట్ అవ్వడంతో 5 ఓవర్లకు 38/3తో చిక్కుల్లో పడింది. డేవిడ్ మిల్లర్, కెప్టెన్ అక్షర్‌తో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అక్షర్ పటేల్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మాధవ్ తివారీ 8 బంతుల్లో 18 పరుగులు చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు అవసరం కాగా మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి విజయం దక్కింది.
