కల్పన ఎక్కడ.. బంధువులు అరెస్ట్

May 12, 2026 11:20 AM

పనిమనిషిగా ఇళ్లలో చేరడం, అదను చూసి దోపిడీలకు పాల్పడి ఎక్కడా ఆధారాలు దొరకకుండా పరారీ కావడం కల్పన అనే మహిళ నేర శైలి. పోలీసు రికార్డుల్లో ‘మాయ లేడి’గా మారిన ఈమె నేర చరిత్ర హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్యతో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఇంట్లో కల్పన ఎనిమిది నెలల క్రితం పనికి చేరింది. యజమాని బెంగళూరు వెళ్లిన సమయం చూసి, సురేష్ అనే వ్యక్తి సూచనల మేరకు పుణె నుంచి మరో ముగ్గురిని హైదరాబాద్‌కు రప్పించింది. రెండు రోజుల పాటు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించి, సీసీ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకునే మార్గాలను ప్లాన్ చేసుకున్నారు.

అర్ధరాత్రి వినయ్ రంజన్ భార్య తనూజను (61) దారుణంగా హత్య చేసి, బీరువాలోని 22 తులాల బంగారంతో ఉడాయించారు. హత్య అనంతరం నిందితులు ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్ చేరుకుని తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరు నాగ్‌పూర్ వెళ్తారని భావించిన పోలీసులు అక్కడ కాపు కాశారు. కానీ, కల్పన మధ్యలోనే ‘కాజీపేట’ స్టేషన్‌లో రైలు దిగినట్లు గుర్తించారు.

అక్కడి నుంచి బస్సులో పుణె, ముంబై లేదా ఢిల్లీకి వెళ్లిందా? లేక పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తిరిగి హైదరాబాద్ చేరుకుందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్య తర్వాత పాత మొబైల్ ఫోన్లు పడేసి, కొత్త ఫోన్లు, సిమ్ కార్డులు వాడుతూ ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. నకిలీ పేర్లు, తప్పుడు ఆధార్, ఓటర్ ఐడీ కార్డులతో కల్పన ముఠా పుణె, బెంగళూరు నగరాల్లోనూ పనిమనుషులుగా చేరి చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో కల్పన ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పుణెలో ఉన్న ఆమె తల్లిదండ్రులు, సోదరి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media