హైదరాబాద్ నగరంలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన ఆద్విక్ అనే బాలుడు వేసవి సెలవుల కోసం టీచర్స్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంటి సెల్లార్‌లో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా 10 వీధికుక్కలు అతడిపై విరుచుకుపడ్డాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే కుక్కలు బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు చేశాయి. ఈ దాడిలో బాలుడి తలపై చర్మం ఊడిపోయిందని, తీవ్ర రక్తస్రావం అయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆద్విక్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
