కేరళం రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు దీప్‌దాస్ మున్షీ, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఈ ప్రకటన చేశారు. సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత రమేశ్ చెన్నితాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి, సతీశన్‌ను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రాహుల్ సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
కొచ్చి జిల్లాకు చెందిన 62 ఏళ్ల సతీశన్, వృత్తిరీత్యా న్యాయవాది. 2001లో పారావూర్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘోర పరాజయం తర్వాత అనూహ్యంగా ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు సతీశన్. గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, ఏఐ కెమెరాల ఆరోపణల వంటి అంశాలపై పినరయి విజయన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వామపక్ష వ్యతిరేక రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.
