తనకు అతీంద్రియ శక్తులున్నాయని నమ్మించి బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన భారత సంతతి ఇమామ్‌కు యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది. తూర్పు లండన్‌కు చెందిన 54 ఏళ్ల అబ్దుల్ హలీమ్ ఖాన్ కనీసం 20 సంవత్సరాలు జైలులో గడపాలని కోర్టు తీర్పు వెలువరించింది.
ఓల్డ్ ఫోర్డ్ రోడ్‌లో ఇమామ్‌గా పనిచేస్తున్న అబ్దుల్ హలీమ్ ఖాన్ తొమ్మిదేళ్ల పాటు దారుణాలకు పాల్పడ్డాడు. 2005 నుంచి 2014 మధ్య కాలంలో ఏడుగురు మహిళలు, బాలికలను లైంగికంగా హింసించాడు. బాధితులతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి వారిని ఫ్లాట్లు, రహస్య ప్రదేశాలకు పిలిపించేవాడు. అక్కడ వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. బాధితులలోని దుష్ట శక్తులను తరిమికొడతానని, మరికొందరికి ఉన్న అనారోగ్యాలను నయం చేస్తానని మాయమాటలు చెప్పేవాడు. అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతికి తానే నయం చేస్తానని చెప్పి కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ కేసులో ఫిబ్రవరిలోనే దోషిగా తేలిన ఖాన్‌పై మొత్తం 21 అభియోగాలు నమోదయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళలు, బాలికలనే లక్ష్యంగా చేసుకుని ఖాన్ ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.
