భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో (స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్) 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును నిల్వ చేసేందుకు యూఏఈ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరింది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL), అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) మధ్య కుదిరిన వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించారని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ తెలిపింది.
ముడిచమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలను కలుపుకొని సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కృషి చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా, భారత్లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను ఏర్పాటు చేయడంపైనా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కుదిరాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు.
