ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం వివాహం, విడాకులు, బాల్య వివాహాలు వంటి అంశాలకు సంబంధించి ఒక వివాదాస్పద కొత్త కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై మహిళా హక్కుల కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రసార సంస్థ అము టీవీ నివేదిక ప్రకారం భార్యాభర్తల మధ్య విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే పేరుతో ఉన్న ఈ 31 అధికరణల నిబంధనను తాలిబన్ సర్వోన్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించారు. ఇది ఇటీవల ప్రభుత్వ అధికారిక గెజెట్‌లో ప్రచురించబడింది.
పెళ్లికి అమ్మాయి మౌనం కూడా అంగీకారంగానే పరిగణిస్తామని ఆమోదించిన కొత్త చట్టాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించారు. కుటుంబ వివాదాలు, వివాహాలు, విడాకులు, సంరక్షణ హక్కులు వంటి అంశాలపై మొత్తం 31 ఆర్టికల్స్‌తో ఈ నిబంధనలు రూపొందించారు.
ఆర్టికల్ 5 ప్రకారం, తండ్రి లేదా తాత కాకుండా ఇతర బంధువుల ద్వారా మైనర్లకు కుదిర్చిన వివాహాలు, జీవిత భాగస్వామి సామాజికంగా తగినవారని, కట్నం ఆమోదయోగ్యమని భావించినట్లయితే ఆ పెళ్లి చెల్లుబాటులో ఉంటుంది. అయితే, ఏదైనా రద్దు చేయాలంటే తాలిబన్ కోర్టు ఆమోదం అవసరం. ఈ నిబంధన బాల్య వివాహాలపై తండ్రులకు, తాతలకు విస్తృత అధికారాన్ని కల్పిస్తుంది, అయినప్పటికీ సంరక్షకులు దుర్వినియోగం చేస్తున్నారని లేదా నైతికంగా అనర్హులని తేలితే అటువంటి వివాహాలు చెల్లవు. వ్యభిచార ఆరోపణలు, మత మార్పిడి, దీర్ఘకాలం పాటు కనిపించకుండా పోయిన భర్తలకు సంబంధించిన కేసులలో జోక్యం చేసుకునే అధికారాన్ని కూడా తాలిబన్ న్యాయమూర్తులకు కల్పించారు.
