బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు

May 19, 2026 6:40 AM

భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. బీసీసీఐ చట్టప్రకారం ఏర్పాటైన సంస్థ కాదని, ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులు పొందడం లేదని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వ నియంత్రణలో కూడా లేదని స్పష్టం చేసింది. అందువల్ల ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h) ప్రకారం దీనిని ‘ప్రభుత్వ యంత్రాంగం’గా పరిగణించలేమని తేల్చిచెప్పింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి, జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐకి ఉన్న అధికారం గురించి గీతా రాణి అనే మహిళ 2017లో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. దీనిపై మంత్రిత్వ శాఖ తమ వద్ద సమాచారం లేదని, బీసీసీఐని ప్రభుత్వ యంత్రాంగంగా ప్రకటించనందున ఈ దరఖాస్తును బదిలీ చేయలేమని బదులిచ్చింది. దీంతో ఆమె కేంద్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సమాచార కమిషనర్ పి.ఆర్. రమేశ్, గీతా రాణి పిటిషన్‌ను కొట్టివేశారు. విచారణ సందర్భంగా బీసీసీఐ తమ వాదనలు వినిపించింది. తాము తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేట్ స్వయంప్రతిపత్తి గల సంస్థ మాత్రమేనని, ప్రభుత్వ నియంత్రణ, యాజమాన్యం లేదా నిధులపై ఆధారపడలేదని వివరించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సీఐసీ, బీసీసీఐ సొంతంగా మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టిక్కెట్ల అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉందని పేర్కొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media