ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్ ఫలితంతో గుజరాత్ టైటాన్స్ కూడా ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఒకానొక దశలో ఎంతో నిదానంగా ఆడింది. ట్రావిస్ హెడ్ (6), అభిషేక్ శర్మ (26) త్వరగా అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు 75 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో నితీశ్ రెడ్డి (11), సలీల్ అరోరా (10*) పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ 19 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల స్కోరు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44), కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32), సంజూ శాంసన్ (13 బంతుల్లో 27) రాణించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( 3 వికెట్లు), షకీబ్ హుస్సేన్ (2 వికెట్లు) బౌలింగ్ బాగా చేయడంతో చెన్నై భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి, 16 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరింది. దీంతో ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. 13 మ్యాచ్ లలో 8 విజయాలతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ కు చేరింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ ప్రయాణం కష్టాల్లో పడింది. 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు మాత్రమే సాధించి ఆరో స్థానంలో నిలిచింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలవడంతో పాటు, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ జట్ల ఫలితాలపై కూడా చెన్నై భవితవ్యం ఆధారపడింది.
