తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఫిలిం ఛాంబర్‌కు అధికారికంగా ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. సునీల్ నారంగ్ సమర్పించిన ఈ రాజీనామాను ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఆమోదించింది. ఈ రాజీనామా వెనుక టాలీవుడ్లో గత కొంతకాలంగా నడుస్తున్న ‘పర్సంటేజీ విధానం’ వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలోనే కలెక్షన్ల పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నిర్మాతలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిలిం చాంబర్ వర్గాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

