తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు

May 21, 2026 10:20 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి వేళ బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పలుచోట్ల 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు చేరుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఎండల తీవ్రత పెరగడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు తప్ప పగటి వేళ బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. బయటకు రావాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఐదు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరప్రాంత జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల పరిధిలోని 233 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ముఖ్యంగా పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, కృష్ణా, తిరుపతి, నంద్యాల, ఎన్టీఆర్, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని తెలిపారు.

నేటి నుంచి ఈ నెల 26 వరకు వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media