హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో బుధవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అదుపు తప్పిన ఓ వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు రోడ్డుపక్కన ఉన్న టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది.
వివేకానంద నగర్ కమాన్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కారు అత్యంత వేగంగా వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని, తర్వాత ఆటోను, మరో కారును ఢీకొట్టిన కారు నేరుగా టిఫిన్ సెంటర్లోకి వెళ్లింది.
ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. భారీ శబ్దం రావడంతో టిఫిన్ సెంటర్లో ఉన్న కస్టమర్లు, సమీప దుకాణదారులు, వాహనదారులు, పాదచారులు పరుగులు తీశారు.
ప్రమాదంలో ఓ కారు, బైక్‌తో పాటు టిఫిన్ సెంటర్లోని సామగ్రి దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా దెబ్బతిన్న వాహనాలను రోడ్డు నుంచి తొలగించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

