అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా ఉన్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త అబ్రహం ఒక అరుదైన ఎముక క్యాన్సర్ బారిన పడటమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. తన భర్తకు “అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్” అని నిర్ధారణ అయినందున ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు.
శుక్రవారం ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశంలో గబ్బార్డ్ తన నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేశారు. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI)కి నాయకత్వం వహించే ఆమెకు జూన్ 30 చివరి పనిదినం కానుంది. “నా భర్త అబ్రహం ఇటీవల అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఈ సమయంలో, నేను ఆయన పక్కనే ఉండి, ఈ పోరాటంలో అతనికి పూర్తిగా అండగా నిలవడానికి ప్రజాసేవ నుండి వైదొలగాలి” అని గబ్బార్డ్ తన రాజీనామా లేఖలో రాశారు.
ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, ఇంటెలిజెన్స్ పదవికి తనను విశ్వసించినందుకు ట్రంప్‌కు గబ్బార్డ్ తన రాజీనామా లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా ODNIకి నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు తాను ఎంతో కృతజ్ఞురాలినని ఆమె పేర్కొన్నారు. 43 ఏళ్ల ఈ నాయకురాలు అమెరికా కాంగ్రెస్‌లో పనిచేసిన మొదటి హిందువుగా చరిత్ర సృష్టించారు. తులసి గబ్బార్డ్ అమెరికన్ సమోవాలో జన్మించారు. హవాయి, ఫిలిప్పీన్స్‌లో పెరిగారు. ఆమె తల్లి కరోల్ పోర్టర్ గబ్బార్డ్ హిందూ మతం పట్ల ఆసక్తి పెంచుకున్నారు.


