పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు.. మేడ్చల్‌లో యూపీ యువకుడి అరెస్ట్

May 25, 2026 9:43 AM
medchal to pakistan chatting

పాకిస్థాన్ నిఘా సంస్థ ‘ఐఎస్‌ఐ’ మద్దతు ఉన్న ఉగ్ర ముఠాతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతున్న ఒక యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జయీద్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ పోలీసులు. జయీద్‌ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ నగరానికి వచ్చి, మేడ్చల్‌లోని ముబారక్ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బొమ్మ తుపాకులతో రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఇతడికి అలవాటు. వీటికి మంచి స్పందన రావడంతో మరింత ఎక్కువగా వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.

ఇతడి వీడియోలను గమనించిన పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ సానుభూతిపరులు హబీబ్, రాణాహుస్సేన్‌లు ఇతడికి ఆన్‌లైన్‌లో దగ్గరయ్యారు. వీరికి ఐఎస్‌ఐ ఏజెంట్ షహబాద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా అతడిని రెచ్చగొట్టారు. మేము చెప్పినట్లు వింటే నీకు అసలైన తుపాకులు పంపిస్తామని ఆశ చూపారు. అంతేకాదు అవకాశం ఇస్తే తాను పాకిస్థాన్‌కు వస్తానని జయీద్‌ఖాన్ వారితో చాటింగ్‌లో చెప్పాడు. జయీద్‌ఖాన్ అనుమానాస్పద కదలికలు, సోషల్ మీడియా రీల్స్‌ను పసిగట్టిన నిఘా వర్గాలు వెంటనే మేడ్చల్ పోలీసులను అప్రమత్తం చేశాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితుడి నివాసం నుంచి 2 నకిలీ (బొమ్మ) తుపాకులు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా ఫిబ్రవరి నుంచి ఇతడు ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు.మరింత లోతైన దర్యాప్తు కోసం మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media