రోహిణి కార్తెతో మండుతున్న ఎండలు.. ఏపీ, తెలంగాణలో రెడ్ అలర్ట్

May 26, 2026 10:38 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మరింత ముదురుతున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె మరో 15 రోజుల పాటు కొనసాగనుండటంతో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. జూన్ తొలి వారంలోనే రుతుపవనాలు వస్తే వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా ప్రస్తుతం ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు వడగాలులు కొనసాగనున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలో మంగళవారం 26 మండలాల్లో తీవ్ర వడగాలులు, 137 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుధవారం 70 మండలాల్లో తీవ్ర వడగాలులు, 176 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. మధ్యాహ్న వేళల్లో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

తెలంగాణలోనూ ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ నెల 26 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరింత దంచికొట్టే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. భద్రాచలంలో 45.6 డిగ్రీలు, ఖమ్మంలో 45.4 డిగ్రీలు, హనుమకొండలో 44 డిగ్రీలు, రామగుండంలో 44.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.5 డిగ్రీలు, మెదక్‌లో 42.8 డిగ్రీలు, నల్గొండలో 42.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పగటి వేళల్లో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, ఎక్కువగా ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media