ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల మధ్య గంటకు 40 నుంచి 80 కి.మీ. వేగంతో దుమ్ము తుఫాన్ వీచే సూచనలు ఉన్నాయి.
దిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో ప్రభావం కనిపించనుంది. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
దుమ్ము తుఫాన్ తర్వాత సాయంత్రం 4:30 నుంచి 7 గంటల మధ్య విస్తృతంగా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎన్‌సీఆర్‌లో 60-80 శాతం ప్రాంతాల్లో వర్షం పడొచ్చని అంచనా. చాలా చోట్ల 30 నుంచి 45 నిమిషాల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో స్వల్పకాలం భారీ వర్షం పడొచ్చు. రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడా చిరుజల్లులు కొనసాగవచ్చు.
ఈ వర్షాలతో ప్రస్తుతం 35 డిగ్రీల వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు 23-25 డిగ్రీల మధ్యకు పడిపోయే అవకాశం ఉంది. దీంతో గత కొన్ని రోజులుగా ఉన్న వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

