ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ తో విజయం సునాయాసంగా దక్కింది. 156 పరుగుల లక్ష్య ఛేదన ఆర్సీబీకి ఏ మాత్రం ఛాలెంజింగ్ గా అనిపించలేదు. కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని జట్టుపై ఒత్తిడిని తగ్గించాడు. అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది ఆర్సీబీకి ఘనవిజయాన్ని అందించాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ గుజరాత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్; 37 బంతుల్లో) అర్ధశతకంతో ఆదుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో సత్తా చాటగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్సీబీ ఈ విజయంతో… వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సరసన చేరింది. సీఎస్కే జట్టు 2010, 2011లో వరుసగా టైటిళ్లు గెలవగా, ముంబై ఇండియన్స్ 2019, 2020లో విజేతగా నిలిచింది.

