ఏపీ, తెలంగాణలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల అవకాశం

June 1, 2026 10:56 AM

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవొచ్చని హెచ్చరించారు. వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందన్నారు.

వడగాలులతో అప్రమత్తంగా ఉండాలని సూచన

ఎండల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పగటి వేళ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, తరచూ నీరు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా, ఎండల తీవ్రత మాత్రం తగ్గదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితులు కనిపించవచ్చని తెలిపారు. మరోవైపు పల్నాడు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండొచ్చని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

తెలంగాణలోనూ అదే పరిస్థితి

తెలంగాణలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఉక్కపోతతో పాటు సెగగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media