కాళేశ్వరం: సరస్వతీ అంత్యపుష్కరాలు నేటితో ముగియనున్నాయి. గత 11 రోజులుగా కొనసాగుతున్న ఈ పుష్కరాల సందర్భంగా సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు.
నిన్న ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ముక్తేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, తాగునీరు, వైద్య సేవలు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచింది.


