బెంగళూరు: బెంగళూరులో గవర్నర్ రాక నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడంపై ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో అతని గర్భవతి భార్య వాహనంలోనే చిక్కుకుపోయింది.
ఇది గమనించిన ఆమె భర్త పోలీసులను నిలదీశాడు. ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపివేయడాన్ని తప్పుబడుతూ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే ధర్నా చేపట్టాడు.
గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో జరిగిన ఈ మెరుపు నిరసనతో పోలీసులు కాసేపు బిత్తరపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే స్పందించారు. అనంతరం అతని కారును ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.
అయితే వీఐపీల రాకపోకల సమయంలో ట్రాఫిక్‌ను ఎక్కువసేపు నిలిపివేయడంపై పలువురు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఏర్పాట్లపై పునరాలోచన అవసరమని వ్యాఖ్యలు చేస్తున్నారు.


