ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్ కల్యాణ్ పోస్టు చేశారు.
ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రాస్తా
ఏ రాస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రాస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో నిర్వహించ తలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఇక్కడ శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. చచ్చిపోవడానికైనా సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఇలాంటి చిన్నపాటి ఆంక్షలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణలో జరిగే ప్రతి సమస్యకు ఆంధ్ర ప్రాంతం వారే కారణమనడం భావ్యం కాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తాను ఇప్పటివరకు ఏ ఒక్క తెలంగాణ నాయకుడిని వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదన్నారు. తనకు ప్రజలను రెచ్చగొట్టడం ఇష్టం లేకనే చాలా సందర్భాల్లో తగ్గి ఉన్నానని చెప్పారు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే ఈ వివాదం మొదలైందని, అతనిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్నారు. విషయం తెలిసిన వెంటనే కేసులను వదిలేయమని తానే స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి తనను ఇష్టమొచ్చినట్లు తిట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీ యువతకు అక్కడే ఉద్యోగాలు రావాలని, ప్రాంతీయ అశాంతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో రాష్ట్ర విభజన జరిగిన తీరును నిరసిస్తూ తాను 11 రోజులు అన్నం తినలేదని, దాన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్నం తిననిది తెలంగాణ వచ్చినందుకు కాదు, పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించిన విధానానికి వ్యతిరేకంగానే అని స్పష్టం చేశారు. తెలంగాణ నాయకులు ఎన్నోసార్లు ఆంధ్ర వాళ్లను తిట్టినా తాము భరించామని, పార్టీని ఎలా నడపాలో చెప్పడానికి వేరే వాళ్లెవరో అవసరం లేదన్నారు.



