తెలంగాణకు ఎప్పటికీ ‘OG’ కేసీఆరే.. పవన్ కల్యాణ్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

June 3, 2026 2:54 PM

హైదరాబాద్: తెలంగాణ ఇవ్వమని అడిగితే నాడు తుపాకీ బుల్లెట్లతో అణచివేశారు.. నేడు అబద్ధపు హామీలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అని.. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ‘మీట్ ది ప్రెస్’ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ మార్క్ రాజకీయంపై, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. చరిత్రను గుర్తు చేస్తూనే.. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

కాంగ్రెస్ కర్కశత్వంపై..

1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 12 ఏండ్లకే తెలంగాణలో వివక్షపై మంటలు రేగాయని కేటీఆర్ గుర్తు చేశారు. 1968 నాటికే విద్యార్థులు, ఉద్యోగులు రథసారథులై తొలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. 1968 నుండి 1971 వరకు సాగిన ఆ పోరాటంలో “మా తెలంగాణ మాకు ఇవ్వండి” అని అడిగినందుకు.. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 370 మంది విద్యార్థులను అత్యంత కర్కశంగా బలిగొని, ఉద్యమాన్ని అణచివేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడితేనే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు.

అభివృద్ధి vs కాంగ్రెస్ అరాచకం..

ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చిందని, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిందని స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి మాట తప్పిందని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ఆదాయం పతనమవుతోందని.. ఈ కాంగ్రెస్ పాలన “కరోనా కంటే డేంజర్” అని ప్రజలకు అర్థమైపోయిందన్నారు.

పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్..

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “దేశభక్తి, పోరాటాల గురించి మేం పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు.. తెలంగాణకు ఎప్పటికీ ‘OG’ (Original Gangster) కేసీఆరే అని తేల్చి చెప్పారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని, 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన పవన్‌ను ఎవరూ అడ్డుకోలేదని, ఇక్కడి ప్రజలే ఓట్లతో అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు.

అదేవిధంగా ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమన్న పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ నిలదీశారు. మరి ఆనాడు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వేరుపడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆత్మబలిదానం చేసుకున్నది ప్రాంతీయవాదం కాదా? అని ప్రశ్నించారు. జాతీయవాదం ముసుగులో కేంద్రం చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా అని అడిగారు.

తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదన్న పవన్.. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్ వచ్చి సభ పెడతానంటే ఎలా కుదురుతుందని నిలదీశారు. నటుడిగా మిమ్మల్ని అభిమానిస్తాం.. సోదరుడిగా ఇంటికి వస్తే మంచి బిర్యానీ పెట్టి మర్యాద చేస్తాం. కానీ, మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే మాత్రం ఊరుకోం. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం, మళ్లీ మీ పెత్తనం ఏంటి? తెలంగాణ ఎప్పటికీ భూమిపుత్రుల జాగీరే అని కేటీఆర్ స్ట్రాంగ్ ఫినిషింగ్ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media