శ్రీలంక వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్లో భారత్-ఏ జట్టు ఓటమిని చవిచూసింది. దంబుల్లాలో ఆఫ్ఘనిస్థాన్-ఏ జట్టుతో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతి ప్రకారం భారత్-ఏ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ జట్టు 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (84), కెప్టెన్ తిలక్ వర్మ (66), రుతురాజ్ గైక్వాడ్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లో 44), సూర్యాంశ్ షెడ్గే (27 బంతుల్లో 40) రెచ్చిపోయారు. అనంతరం వర్షం కారణంగా ఆఫ్ఘనిస్థాన్-ఏ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా సవరించారు. 25.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. ఆ సమయానికి డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆఫ్ఘన్ జట్టును విజేతగా ప్రకటించారు.


