రెండు గంటల పాటు తీవ్ర ఆందోళన
సురక్షితంగా బయటకు తీసిన అధికారులు
హైదరాబాద్: Uppal Skywalk Lift లో చిక్కుకుపోయిన 20 ఏళ్ల యువకుడిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాహుల్ ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడే పురుషుల హాస్టల్‌లో ఉంటున్నాడు. విధులు ముగించుకుని గురువారం రాత్రి హాస్టల్‌కు తిరిగి వెళ్తుండగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని స్కైవాక్ లిఫ్ట్‌ను ఉపయోగించాడు. అయితే లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో అతడు అందులో చిక్కుకుపోయాడు. రాహుల్ హార్ట్ పేషెంట్ కావడం…లిప్ట్ లో చిక్కుకుపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ తలుపులు తెరవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో రక్షణ చర్యలు ఆలస్యమైనట్లు తెలిసింది. చివరకు సాంకేతిక నిపుణుడి సహాయంతో రాహుల్‌ను రాత్రి 1.15 గంటల ప్రాంతంలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న దాదాపు రెండు గంటల తర్వాత అతడు బయటకు వచ్చాడు.
రక్షణ చర్యల అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్, ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా స్కైవాక్ లిఫ్ట్‌లలో ఇలాంటి సమస్యలు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. లిఫ్ట్‌ల పనితీరుపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని, నిర్వహణను మరింత బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.



