Nizam Sagar ప్రాజెక్టు ఒడ్డున బైక్, చెప్పులు గుర్తింపు
నీటిలో గాలింపు చేపట్టిన పోలీసులు
సంగారెడ్డి: Nizam Sagar ప్రాజెక్టులో ఓ వ్యక్తి, ఆయన ఇద్దరు చిన్నారులు మునిగిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన జి. కృష్ణ (32), కుమారుడు రక్షిత్ (9), కుమార్తె అనన్య (6) గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లారు. అయితే సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
కొన్నేళ్ల క్రితం కృష్ణ పటాన్‌చెరులో స్థిరపడ్డారు. వేసవి సెలవులు గడిపేందుకు ఇటీవల తల్లిదండ్రుల వద్దకు నిజాంపేట్‌కు వచ్చారు. గురువారం ఉదయం పిల్లలను తీసుకుని నిజాంసాగర్‌కు వెళ్లిన ఆయన, అక్కడ చెట్టు నీడలో వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. రిజర్వాయర్ ఒడ్డున పిల్లలు ఆడుకుంటుండగా సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
ఆ ఫొటోలను భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు పంపించారు. అనంతరం ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని వెతికారు. ఈ క్రమంలో ప్రాజెక్టు సమీపంలో ఆయన చెప్పులు, ద్విచక్ర వాహనం, ఇతర వస్తువులు కనిపించాయి.
దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నీటిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ముగ్గురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది.



