పుణేలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహోద్యోగుల వేధింపుల వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళా ఉద్యోగులతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. టీసీఎస్ హింజేవాడి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అమిత్ అభయ్ బ్రహ్మే (48) జూన్ 2న భోసరిలోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. ఆయన కుమారుడు అనీష్ బ్రహ్మే (19) జూన్ 9న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలం నుంచి పోలీసులు అమిత్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో తన సహోద్యోగినులు అర్చన, శశ్వతి తనను అందరి ముందు పదేపదే అవమానించారని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నైపుణ్యం లేని ప్రాజెక్టులను అప్పగించడం, పనితీరు సరిగా లేదని బహిరంగంగా మందలించడంతో పాటు ఉద్యోగానికి రాజీనామా చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేర, పింప్రి-చించ్‌వాడ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద అర్చన, శశ్వతి, వినోద్ పలిచాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన టీసీఎస్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థలో ఉద్యోగుల శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసింది.


