నీటి నిర్వహణ, ఆహార భద్రతకు భారత్–ఫ్రాన్స్ కీలక భాగస్వామ్యం
INDIA-PARIS : ప్రపంచ నీటి వనరుల నిర్వహణ, ఆహార భద్రతకు తోడ్పడే లక్ష్యంతో INDIA-PARIS కలిసి వచ్చే ఏడాది TRISHNA ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు.
ఇప్పటి భారత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాల్లో బలమైన వ్యవస్థను నిర్మిస్తోందని మోదీ అన్నారు. మరో 50 లేదా 100 సంవత్సరాల తర్వాత ఈ కాలాన్ని పరిశీలిస్తే, భారత ఆకాంక్షలకు ప్రతీకగా గుర్తుంచుకుంటారని చెప్పారు.
ఇటీవల నీస్‌లో నిర్వహించిన “భారత్ ఇన్నోవేట్స్” కార్యక్రమం ద్వారా భారత డీప్‌టెక్ సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేశామని మోదీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేశానికి చెందిన 120 ప్రముఖ డీప్‌టెక్ స్టార్టప్‌లు పాల్గొన్నాయని తెలిపారు. వాటి ద్వారా సుమారు 1,400 బిజినెస్-టు-బిజినెస్ (B2B) సమావేశాలు జరిగాయని, అంతర్జాతీయ సహకారం, ఆవిష్కరణలకు ఇది దోహదపడిందని వివరించారు.
దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు కేవలం వాణిజ్యంపైనే ఆధారపడడం లేదని, పరస్పర విశ్వాసం కూడా అంతే ముఖ్యమని మోదీ అన్నారు.
ఎవియన్‌లో జరిగిన జీ7 సమావేశంలో విశ్వాసంపై ఆధారపడిన భాగస్వామ్యాలను ప్రోత్సహించామని, గ్లోబల్ సౌత్ దేశాలతో సమాన సహకారానికి భారత్ మద్దతు తెలిపిందని మోదీ వెల్లడించారు.
డిజిటల్ రంగంలో భారత్ సాధించిన పురోగతిని కూడా మోదీ ప్రస్తావించారు. దేశంలోని సుమారు 90 కోట్ల మంది పౌరులకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ ఐడీలు అందించామని, దీంతో వైద్య రికార్డులు సురక్షితంగా ఉండటంతో పాటు ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు.
అంతకుముందు మోదీ యూరప్‌లోని అతిపెద్ద టెక్నాలజీ, ఇన్నోవేషన్ సదస్సుల్లో ఒకటైన VivaTech 2026లో ప్రసంగించారు. అలాగే ఎవియన్‌లో జరిగిన జీ7 సదస్సులో పాల్గొని పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.



