సిగరెట్ తెమ్మని డ్రైవర్‌ను పంపించి కారు దొంగిలించిన వ్యక్తి
హైదరాబాద్: Medipally పరిధిలో ఓ వ్యక్తి ప్రయాణికుడిగా నటించి క్యాబ్ డ్రైవర్‌ను మోసం చేసి కారుతో పరారైన ఘటన జరిగింది. సిగరెట్ కొనివ్వాలని చెప్పి డ్రైవర్‌ను వాహనం నుంచి దింపించి, అదే అవకాశంగా తీసుకుని కారును తీసుకెళ్లాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన చి. భాను ప్రభు (26) అద్దె క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 20న ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద తన Swift Tour CNG కారుతో ప్రయాణికుల కోసం వేచి ఉన్నాడు.
ఆ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి చెంగిచర్లకు వెళ్లాలని చెప్పి, ప్రయాణానికి రూ.450 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. కారు Medipally గ్రామం వద్దకు చేరుకున్న తర్వాత తనకు కాలి నొప్పి ఉందని చెప్పి, సమీపంలోని దుకాణం నుంచి సిగరెట్ తీసుకురావాలని డ్రైవర్‌ను కోరాడు.
Medipally లో క్యాబ్ డ్రైవర్‌ను మోసం చేసిన గుర్తుతెలియని వ్యక్తి:
ప్రయాణికుడిని నమ్మిన భాను ప్రభు కారును రోడ్డుపక్కన నిలిపి సిగరెట్ తీసుకురావడానికి వెళ్లాడు. అదే సమయంలో ఆ వ్యక్తి డ్రైవర్ సీటులోకి మారి కారును వేగంగా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
కారును వెంబడించేందుకు భాను ప్రభు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం మెడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.



